MLA Seats Politics In BRS : శాసనసభ ఎన్నికల ముంగిట అధికార బీఆర్‌ఎస్‌లో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో తిరుగుబావుటా ఎగురవేస్తున్న దిగువస్థాయి నేతలు.. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలంటూ పట్టుబడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు టిక్కెట్ ఇవ్వద్దని నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలంతా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌ని వేర్వేరుగా కలవడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రెండుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిచిన అరూరి రమేష్ ఉద్యమకారులను.. ఇతర నేతలను పట్టించుకోకుండా ఏకపక్ష వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని రమేష్‌కి టిక్కెట్ ఇవ్వద్దని కోరుతున్నారు. అంతే కాకుండా తన తనయుడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
మామిడి తోటల చుట్టూ తిరుగుతున్న గులాబి రాజకీయం :ఇక మానుకోటలోనైతే గులాబీ రాజకీయం మామిడి తోటల చుట్టూ తిరుగుతోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ టిక్కెట్ ఇవ్వద్దంటూ.. నియోజకవర్గ నేతలు.. మామిడి తోటల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత వారంలో మాహబూబాబాద్ మండలం ముడుపుగల్లులో.. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు గళం విప్పారు. శంకర్ నాయక్‌కు ఈ దఫా బీఆర్‌ఎస్ టిక్కెట్ ఇవ్వొద్దని కోరారు. వీరంతా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అనుచరులేనని సమాచారం. కేసముద్రం, మదనకుర్తి మామిడితోటల్లోనూ అసమ్మతి వర్గీయులు సమావేశమయ్యారు.
Another Group Against MLA Redyanaik In Dornakal : డోర్నకల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు వ్యతిరేకంగా పార్టీలోనే మరో వర్గం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల సమస్యలపై నిలదీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వివాదం మరింత ముదరకుండా మంత్రి ఎర్రబెల్లి.. అసమ్మతి నేతలు, ఎమ్మెల్యేకు మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ టిక్కెట్ అడగడం సహజమేనని.. అధిష్ఠానం నిర్ణయమే అందరికీ శిరోధార్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.
మళ్లీ పోటీలో వస్తున్న చెన్నమనేని రమేష్‌బాబు :ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేష్‌బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఇటీవల నర్మగర్భంగా చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన మళ్లీ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Political Battle In Ramagundam BRS : ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు మద్దతివ్వాలంటూ ఆశీర్వాద యాత్ర చేపట్టిన నేతలు.. కోరుకంటికి టికెట్ ఇవ్వొద్దంటూ పట్టుబడుతున్నారు. పార్టీలో సమన్వయం పూర్తిగా లోపించిందని ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. చందర్‌కు టిక్కెట్ ఇస్తే మాత్రం తాము పనిచేయబోమని తెగేసి చెబుతుండటంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కినట్లయింది.
ఇవీ చదవండి :