MLA Rajasingh New Bullet Proof Vehicle: తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనంపై తరచూ సీఎంకీ, డీజీపీకి లేఖ రాస్తూ అసంతృప్తి వ్యక్తం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వాహనాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు మార్చింది. ఈసారి 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతలో భాగంగా సమకూర్చింది. అయితే ఎన్నిసార్లు విన్నవించిన ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఇటీవల తనకు మొదట ఇచ్చిన పాత వాహనాన్ని ప్రగతిభవన్‌లో వదిలేసి వచ్చారు.
ఇలా చేసిన వెంటనే పోలీసులు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం విశేషం. అయితే ఈ వాహనం కేటాయింపుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రస్తుతం తాను శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరానని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తెలుపురంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తన ఇంటి వద్దకు తెచ్చి పెట్టారని చెప్పారు. అయితే తాను ఇంటికి వెళ్లాక ఆ వాహనం ఎలా ఉందో చూడాలని.. దాని కండిషన్ ఎలా ఉందో చూస్తానని పేర్కొన్నారు. కొత్త కారే తనకు కావాలని లేదని.. మంచి కండిషన్ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తే తనకు అదే చాలని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.
అసలేం జరిగింది:ఉగ్రవాదులు, విద్రోహ శక్తుల నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణ హాని ఉందని వెంటనే తనకు పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వెంటనే ఈ విషయంపై ఇంటెలిజెన్స్‌ను దృష్టి సారించమని చెప్పింది. అయితే వెంటనే 2010 మోడల్‌కు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాజాసింగ్‌కు భద్రతా కారణాలు దృష్ట్యా కేటాయించారు. ప్రభుత్వం రాజాసింగ్ భద్రతకు వాహనం కేటాయించిన.. అది మూడ్నాళ్ల ముచ్చటలాగా మారింది. ఎందుకంటే ఆ వాహనం తరచూ మరమ్మత్తులకు గురవుతుందేది. ఎక్కడపడితే అక్కడే వాహనం నిలిచిపోయేది. దీనిపై విసుగు చెంది ఎమ్మెల్యే ఆ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో అనే చెప్పాలి.