ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.4 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను ఒక ఆంధ్ర కాంట్రాక్టర్‌కు కట్టబెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. తోట చంద్రశేఖర్‌తో బీఆర్‌ఎస్ సభకు ఖర్చు పెట్టిస్తున్నారని.. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరుగుతుందని ఆరోపించారు. మియాపూర్ భూములను బీఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి ఎలా కట్టబెడుతున్నారని నిలదీసిన ఆయన.. ఆ విషయం రేపు ఖమ్మంలో జరిగే సభలో చెబితే బాగుంటుందన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
హఫీజ్‌పేటలోని 78 సర్వే నెంబర్ భూములను తనఖా పెట్టి ఎంబీఎస్ జువెల్లర్స్ సుఖేశ్ గుప్తా రుణం తీసుకున్నారని.. ఆ భూమిని అమ్ముకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చిందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ 7 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారని తెలిపారు. ఇక్కడ కనిపించని మరో కోణం ఉందన్న ఆయన.. ఇదే సర్వే నెంబర్‌లో 40 ఎకరాల భూమి ఆదిత్య కంపెనీ మీద తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారని తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో జిల్లా కలెక్టర్ అప్పీలుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ అంటే బిహార్ రాష్ట్ర సమితిగా పేర్కొన్నారు.
మియాపూర్, హఫీజ్‌పేట ప్రభుత్వ భూముల్లో అవకతవకలు జరిగాయి. మియాపూర్ భూములను ఏపీ నేతలకు కట్టబెడుతున్నారు. హఫీజ్‌పేటలో 40 ఎకరాలు తోట చంద్రశేఖర్‌కు ఇస్తున్నారు. ఆదిత్య కంపెనీ పేరు మీద తోట చంద్రశేఖర్ కొన్నారు. తోట చంద్రశేఖర్ చేత బీఆర్ఎస్కు ఖర్చు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ భూముల విషయంలో క్విడ్ ప్రో కో జరుగుతోంది. భూముల బదిలీపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. - ఎమ్మెల్యే రఘునందన్
మరోవైపు నిజాం అంత్యక్రియలపైనా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ దెబ్బకొడుతున్నారని మండిపడ్డారు. సమైఖ్యవాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నామన్న ఆయన.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ఎవరకి ఊడిగం చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. కేసీఆర్ చర్యలతో కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ లాంటి వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని దుయ్యబట్టారు.