తెలంగాణ

telangana

ETV Bharat / state

హోంమంత్రి మనవడి ప్రమేయం ఉందనే కేసుపై నిర్లక్ష్యం: రఘునందన్‌రావు - రఘునందన్‌రావు వ్యాఖ్యలు

Minor Girl Gang Rape Case:హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన యువతిపై అత్యాచారం కేసులో ఎన్నో అనుమానులున్నాయని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. సాక్షాత్తూ హోంమంత్రి మనువడు ప్రమేయం ఉన్నందునే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Jublee hills minor girl rape incident
Jublee hills minor girl rape incident

By

Published : Jun 3, 2022, 7:36 PM IST

Minor Girl Gang Rape Case:హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జరిగిన యువతి అత్యాచారం కేసులో పోలీసుల తీరును భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తప్పుపట్టారు. ఘటన జరిగిన మూడురోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటమేంటని ప్రశ్నించారు. సీసీ ఫుటేజీని మాయం చేశారని ఆరోపించారు. పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతిస్తారని నిలదీసిన రఘునందన్‌... హోంమంత్రి మనువడి ప్రమేయం ఉన్నందునే చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకాడుతున్నారని మండిపడ్డారు.

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: మహిళల భద్రత విషయంలో దేశానికే ఆదర్శమని చెప్పే ప్రభుత్వ పెద్దలు రాజధానిలో జరిగిన దారుణ ఘటనపై నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజీలో ఒక్క సెకను తొలగించినట్లు తెలిసినా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న రఘునందన్‌ 24 గంటల్లో నిందితులను పట్టుకుని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

''దేశంలో మేము రామరాజ్య స్థాపనకు కృషి చేస్తుంటే... రాష్ట్రంలో దుష్ట, రాక్షస పాలన సాగుతోంది. 1200 కోట్లు పెట్టి కట్టిన పోలీస్ కమాండ్ సెంటర్, సీసీ కెమెరాలు పని చేయడం లేదా? షీ టీమ్స్ ఏం చేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేనన్ని సీసీ కెమెరాలు తెలంగాణలో ఉన్నాయని అంటున్నారు. మరి అవి పనిచేయడం లేదా? 28న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లో ఉన్న ఓ పబ్‌లో రాష్ట్ర హోంమంత్రి మనవడు బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చాడు. స్వయంగా మంత్రి పీఏ ఆ పబ్ బుక్ చేశాడు. పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతిస్తున్నారు. పబ్‌లపై అధికారుల నియంత్రణ ఉండదా? 28న సంఘటన జరిగితే 31 వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలి. ఎఫ్‌ఐఆర్‌ బయటి ప్రపంచానికి తెలిసింది మే 2న. ఇన్ని రోజుల ఆలస్యానికి కారణమేమిటి? పోలీసులు ఎఫ్‌ఆర్‌లో కారు నంబర్లు నమోదు చేశారు. రేప్ చేసింది కార్లా? '' -రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే

హోంమంత్రి మనవడి ప్రమేయం ఉందనే కేసుపై నిర్లక్ష్యం: రఘునందన్‌రావు

ట్విటర్‌ పిట్ట ఎందుకు మూగపోయింది?:ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. హిందు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. నిందితులు వినియోగించిన కార్లు తెరాస, ఎంఐఎం పార్టీ నేతల బంధువుల పేర్లపై ఉన్నాయన్నారు. ఇటీవల బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన కారు యాక్సిడెంట్ చేసినా నిందితులను పట్టుకోలేదని విమర్శించారు. ట్విటర్‌ పిట్ట ఎందుకు మూగపోయిందని ఎద్దేవా చేశారు.

''ఎమ్మెల్సీ కవిత మహిళ అయి ఉండి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు. అమ్మాయి ఇంటి నుంచి బయటకు వచ్చినంత వరకు సీసీ టీవీ కెమెరా డేటా తీసుకున్నారా లేదా? డీజీపీ సమాధానం చెప్పాలి? హిందువులపై రజాకార్ల దాడి కొనసాగుతూనే ఉంది. హోంమంత్రి మనవడు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ కుమారుడు, ఒక ప్రముఖ హిందీ పత్రిక యజమాని కుమారుడు ఇందులో ఉన్నాడు. మీ హోంమంత్రి కాబట్టి దర్యాప్తు సరిగ్గా జరగకపోవచ్చు. సీసీ టీవీ ఫుటేజీలో ఒక్క సెకను తొలగించినట్లు తెలిసినా మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలి.'' -రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే

బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై రేవంత్‌రెడ్డి కామెంట్స్:తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఈ నెల 28న జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ట్విటర్‌ ద్వారా తీవ్రంగా స్పందించారు. పేద, మధ్య, ధనిక అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ఆడపిల్లలకు భద్రత కరువైందని ట్విటర్‌ ద్వారా రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పట్టపగలు 17ఏళ్ల ఆడబిడ్డపై అత్యాచారం జరిగి ఐదు రోజులైనా నిందితులపై చర్యలు లేవని... ఇప్పటి వరకు అరెస్టులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నిందితులకు సర్కారే కంచెగా మారిందని.... ఈ ఘటనపై ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా... సీఎం కేసీఆర్ స్పందించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details