తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది (mla quota mlc elections). తెరాసకే 19 స్థానాలు దక్కడం లాంఛనంగా ఉన్నందున.. చాలా మంది నేతలు ఆశపడుతున్నారు. తెరాస నాయకత్వం గతంలో ఇచ్చిన హామీతో పాటు సామాజిక, ప్రాంతాల వారీగా సమీకరణాలు, రాజకీయ ప్రయోజనాలన్నింటినీ కలిపి బేరీజు వేస్తోంది. శాసనసభ్యుల కోటా ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈనెల 16 వరకు ఉంది. కాబట్టి ముందుగా ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు (mla quota mlc elections). నేడో రేపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మధుసూదనచారి, కడియం శ్రీహరి (kadiyam srihari), ఎల్.రమణ(l ramana), గుత్తా సుఖేందర్ రెడ్డి, కోటి రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఆకుల లలిత, తక్కళ్లపల్లి రవీందర్ రావు, పేర్లు తుది పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించి.. ఆ స్థానంలో గుత్తా సుఖేందర్ రెడ్డి గాని మరొకరి పేరును సిఫార్సు చేయవచ్చునన్న ప్రచారంపై కూడా ఒకటి, రెండు రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల కోటా ఎన్నికలపై దృష్టి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎన్నికల అభ్యర్థులను కూడా కలిపి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ... ఇలా అన్ని వర్గాలకు స్థానం ఉండేలా తెరాస నాయకత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, (k kavitha) బాలసాని లక్ష్మీనారాయణ (balasani lakshminarayana), భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. వారిలో కవితతో పాటు దాదాపు సగానికి పైగా నేతలకు మరోసారి అవకాశం ఉండొచ్చునని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.