MLAs Poaching Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ముగ్గురికి షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. ఎట్టిపరిస్థితుల్లో దర్యాప్తును ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వాదనలు వినిపించిన నిందితుల తరఫు న్యాయవాది.. నిందితులు ఇప్పటికే నెల రోజులకు పైగా జైలులో ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టు సైతం బెయిల్ ఇవ్వొచ్చని అభిప్రాయపడిన విషయాన్ని కోర్టుకి వివరించారు. 41ఏ నోటీసు ఇవ్వకుండా రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌ను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టినట్లు.. నిందితుల తరఫు న్యాయవాది రవి చందర్ వాదించారు. ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకుని.. హైకోర్టు నిందితులకు రిమాండ్ విధించిందన్న సుప్రీంకోర్టు మాటలని నిందితుల తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు: ఆ సమయంలో జోక్యం చేసుకున్న పోలీసుల తరఫు న్యాయవాది.. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేయడంతో పాటు సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కీలక దశలో ఉందని వివరించారు. ఈ సమయంలో నిందితులకు బెయిల్‌మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని కోరారు. అయితే నిందితుల తరఫు వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. అందుకు కొన్ని షరతులు పెట్టింది. మూడు లక్షల రూపాయలతో పాటు ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.