MLA pilot Rohit Reddy media conference: బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రలో ఎక్కడా కూడా డబ్బు అనే మాట లేదు, మనీలాండరింగ్ జరగలేదని చెప్పారు. ఏదో విధంగా ఈడీని పంపించి నన్ను ఇబ్బంది పెట్టి, భయబ్రాంతులకు గురి చేసి.. లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు భావిస్తున్నారు.
ఏ కేసులో అయినా నిందితులను ముందుగా పిలిచి విచారణ జరిపించడం అందరికీ తెలిసిన విషయం అని స్పష్టం చేశారు. కానీ ఈడీ మాత్రం అందుకు విరుద్ధంగా ఫిర్యాదుదారుడినే పిలిచి విచారించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రెండు రోజులు అభిషేక్‌ను, తనను పిలిచి విచారించినా.. వాళ్లు అనుకున్నట్లు ఏదీ జరగలేదని తెలిపారు.
దీంతో రూటు మార్చి.. ముఖ్య సూత్రధారి అయిన నందకుమార్‌ని విచారిస్తామని కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వెల్లడించారు. రోహిత్‌రెడ్డిని అతని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంగా.. నందకుమార్‌తో వారికి అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారన్నారు. ఆ వాంగ్మూలంతో తనను ఈ కేసులో ఇరికించడమే వారి వ్యూహం.. ఇదే మాకు అందిన సమాచారం అని ప్రకటించారు. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా బీజేపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నా కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసినా.. వ్యక్తిగత ఇమేజ్‌ని దెబ్బతియాలని చూసినా.. నేను మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు.