MLA Rohit Reddy Fires on Bandi Sanjay : డ్రగ్స్ కేసుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి నేడు మరోసారి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ ప్రమాణం చేసి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని రోహిత్‌రెడ్డి శనివారం బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. ఆదివారం తాను ఆలయానికి వస్తానని.. తన సవాల్‌ను స్వీకరించి బండి సంజయ్ తడిబట్టలతో వచ్చి కర్ణాటక పోలీసుల నుంచి వచ్చాయని చెబుతున్న నోటీసులు, ఎఫ్ఐఆర్ కాపీలను అమ్మవారి సన్నిధిలో చూపించాలని.. లేనిపక్షంలో అమ్మవారి ఎదుట లెంపలేసుకుని, తప్పయిపోయిందని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలోనే నేడు మరోసారి ఆయన ఆలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్‌రావులు తనపై చేసిన ఆరోపణలపై ఎక్కడికి రమ్మన్నా వస్తానన్న ఆయన.. దీనికి సిద్ధమైతే చెప్పండంటూ సవాల్ విసిరారు. గతంలో ఎమ్మెల్యే రఘునందన్ అక్రమ వసూలు చేసేవారని.. ఆయన రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం వారికే చెందిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆ ఆరోపణలు తప్పని ప్రజలకు అర్ధమైంది..: కర్ణాటక డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. హిందుత్వం పేరుతో బండి సంజయ్ యువతను రెచ్చగొడుతున్నారన్న ఆయన.. తాను నిజమైన హిందువుగా అమ్మవారి సాక్షిగా సవాల్ చేస్తే స్వీకరించలేదని తెలిపారు. సంజయ్ చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకు అర్థమయిందని చెప్పారు. తెలంగాణ ప్రజలపై బీజేపీ నేతలు దొంగ ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నారని ఆరోపించారు. తనకు వచ్చిన ఈడీ నోటీసుల విషయంలో తమ న్యాయవాదులతో చర్చించి సాయంత్రంలోగా నిర్ణయం వెల్లడిస్తానన్నారు రోహిత్ రెడ్డి