తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఈడీ విచారణ.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం.. - MLA Pilot Rohit Reddy latest news

'చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు వచ్చా.. అన్నీ అప్పుడే చెబుతా'
'చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు వచ్చా.. అన్నీ అప్పుడే చెబుతా'

By

Published : Dec 19, 2022, 3:18 PM IST

Updated : Dec 19, 2022, 11:02 PM IST

15:16 December 19

ముగిసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఈడీ విచారణ.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం..

ముగిసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఈడీ విచారణ

మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోగా.. 6 గంటల పాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. రేపు మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఈడీ విచారణ అనంతరం బయటకొచ్చిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు తన వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారని ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తన వ్యాపార వివరాలు, ఫ్యామిలీ వివరాలు అడిగారని చెప్పారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. ఏ కేసులో నన్ను పిలుస్తున్నారనేది ఇప్పటి వరకు ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదన్న ఆయన.. రేపు మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. దర్యాప్తు సంస్థల మీద తనకు గౌరవం ఉందని.. రేపు ఉదయం 10:30కు మరోసారి విచారణకు వస్తానని స్పష్టం చేశారు.

అయ్యప్ప దీక్షలో ఉన్నాను.. కొంత సమయం కావాలని ఈడీని కోరాను. నా పీఏ ద్వారా లెటర్ పంపితే.. తిరస్కరించారు. 3 గంటలకు రావాలని నాకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు సంస్థల మీద ఉన్న గౌరవంతో నేను వచ్చాను. నా వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మళ్లీ రేపు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 10:30కు వస్తాను. - ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

నాటకీయ పరిణామాలు..: ఇదిలా ఉండగా.. ఉదయం రోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం పదిన్నరకు.. మణికొండలోని తన నివాసం నుంచి బయలుదేరిన రోహిత్ రెడ్డి.. నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. పీఏ శ్రవణ్‌తో ఈడీ అధికారులకు లేఖ పంపిన రోహిత్ రెడ్డి.. తాను అయ్యప్ప మాల ధరించానని, ఈ వారంలో మహాపడిపూజ ఉందని దానికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా నోటీసుల్లో కోరిన వివరాలన్నీ ఇవ్వడానికి 3 రోజుల వ్యవధి సరిపోలేదని.. సమాచారం అంతా ఇవ్వడానికి వారం రోజుల గడువు కావాలని రోహిత్ రెడ్డి లేఖలో కోరారు. ఈ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని పీఏ ద్వారా సమాచారం అందుకున్న రోహిత్‌ రెడ్డి.. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరయ్యారు.

ఈడీ ఆఫీస్‌.. వయా ప్రగతిభవన్..: హైదరాబాద్‌లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ.. సహాయ సంచాలకుడు దేవేందర్ సింగ్ పేరిట గత శుక్రవారం అధికారులు రోహిత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. రోహిత్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టుతో పాటు తనకు, తన కుటుంబానికి చెందిన బ్యాంకుకు సంబంధించి.. పూర్తి వివరాలు, ఇతర వ్యాపారాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లింపులతో పాటు.. ఇతర క్రయవిక్రయాలకు సంబంధించి గత ఏడేళ్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు. ఈడీ నోటీసుల విచారణ ఉదయం పదిన్నరకు హాజరుకావాల్సి ఉండగా.. అదే సమయంలో మణికొండలోని తన నివాసం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత 12 గంటల సమయంలో ప్రగతి భవన్ నుంచి బయటికి వెళ్లారు. ఈడీ అధికారుల నిర్ణయాన్ని పైలెట్ రోహిత్ రెడ్డికి పీఏ శ్రవణ్ చెప్పిన తర్వాతనే ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి..

సమయం ఇవ్వడానికి నిరాకరించిన ఈడీ..

ఆయన మేడ్చల్‌కే మంత్రి కాదు: మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తగళం

Last Updated : Dec 19, 2022, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details