MLA KTR on Parliament Elections 2023 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయలేకపోతే కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయమని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీ సన్నాహక సమావేశాలను బీఆర్‌ఎస్ ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీశ్‌రావు, తదితర సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ముఖ్యనేతల అభిప్రాయాలు, ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. కొందరు నేరుగా అభిప్రాయాలు చెప్పగా మరికొందరు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎంగా కేసీఆర్ లేకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్‌పై జరిగిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని కొందరు చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు(Congress 420 Guarantees) ఇచ్చి గెలిచిందని వివరించారు. పార్లమెంటు ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ బీఆర్‌ఎస్ నేతలపై దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆగడాలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎండగడతామని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
KTR Fires on Congress and BJP : బీఆర్‌ఎస్ ఎంపీలనే ఎందుకు గెలిపించాలో ప్రజలకు చెప్తామని కేటీఆర్ వివరణ ఇచ్చారు. తెలంగాణ గళం, బలం, దళం పార్లమెంటులో చూడాలంటే బీఆర్‌ఎస్ గెలవాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేవలం బీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రధాన కేంద్రం, ప్రధాన అజెండా తెలంగాణ(Telangana)నే అని చెప్పారు. దేశంలో ఒక్కో రాష్ట్రం పేరు చెప్తే ఒక్కో నేత గుర్తు వస్తారని, అలా జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కేసీఆర్ పేరు మాత్రమేనని హర్షించారు.