MLA KTR in Warangal Lok Sabha Preparatory Meeting : ప్రజలను వంచించాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుకేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిజస్వరూపం వారు ఇచ్చిన 420 హామీలతోనే ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న వరంగల్ లోక్‌సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
విధ్వంసమైన తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్(KCR) కష్టపడినంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని కేటీఆర్ వివరించారు. తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని తెలిపారు. పరిపాలనపై పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించినట్లు వివరించారు. పార్టీ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళతామని చెప్పారు. ఉద్యమాల వీరగడ్డ వరంగల్ జిల్లాలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే బీఆర్ఎస్ నేతలు ఓడిపోయారని, జయశంకర్ సార్ పుట్టిన నేలలో 2014, 2019లో వరంగల్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు.
Warangal Lok Sabha Meeting at Telangana Bhavan : ఈసారి కూడా వరంగల్లో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. సన్నాహక సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయని తెలిపారు. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల(Lok Sabha 2024) నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి, పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉందని కేటీఆర్ చెప్పారు.