MLA Kadiyam Srihari Press Meet at Telangana Bhavan : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికే 420 హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, బ్రహ్మాండమైన సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు భ్రమలు కల్పించారన్నారు. కానీ నెల రోజుల్లోనే ప్రజలకు నిరాశ ఎదురైందని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం(Lok Sabha Election 2024) సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరాలు వెల్లడిస్తూ, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తవి ఇవ్వకపోగా, గత ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవేదన చెందారు. గృహలక్ష్మీ(Gruhalakshmi) కింద కలెక్టర్లు అర్హతలు గుర్తించి లబ్ధిదారులను ఖరారు చేశారని, కొంత మంది ఇళ్ల పనులు ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మీ రద్దు చేయడంతో పేదలు రోడ్డున పడ్డారని, ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి ఇందిరమ్మ ఇళ్ల(Indiramma House Scheme) నిర్మాణంలో వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కడియం శ్రీహరి కోరారు.
రాష్ట్రంలో దళిత బంధును కూడా ఆపివేయాలని ఆదేశాలు ఇచ్చారని, రైతు బంధు విషయంలో కూడా జాప్యం జరుగుతోందని కడియం శ్రీహరి అన్నారు. ఎకరాలకు రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇంకా రైతుబంధు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఆదాయ వనరులపై అవగాహన లేకుండా ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై తొలి సంతకం అన్నారని, కానీ నేటి వరకు అతీగతి లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ పేరు అనామకం అవుతుంది : కేటీఆర్