Jaggareddy meet manikrao thackrey in hyderabad: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఠాక్రే బాధ్యతలు తీసుకున్నాక వీరిద్దరి మధ్య ఇదే మొదటి సమావేశం. బీఆర్ఎస్, బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై తమ మధ్య చర్చ జరిగినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం కట్టబట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరాని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని 70 స్థానాల్లో విజయం కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనతలను ఠాక్రేకు వివరించానని తెలిపిన జగ్గారెడ్డి.. పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావడానికి, బలోపేతం చేయడానికి చాలా మంది సీనియర్ నాయకులు పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించారని వివరించారు.
తాను కూడా పాదయాత్రను ప్రారంభిస్తానని, రూట్ మ్యాప్‌ను త్వరలో తెలియజేస్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి మాటలను వక్రీకరించారన్నారు. ఆయన చెప్పింది ఒకటైతే మీడియాలో వచ్చింది మరొకటన్నారు. ప్రజలకు అది మరోలా అర్థమైందని.... పొత్తులపై వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగదు.. జరగలేదు. పార్టీకి నష్టం చేసేలా కోమటిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ వ్యాఖ్యలతో కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. రాహుల్‌గాంధీ కార్యాచరణకు అనుగుణంగా కాంగ్రెస్ నాయకులందరం పనిచేసి రాష్ట్రంలో 70స్థానాల్లో విజయం కోసం కృషిచేస్తాము.ఆయన నాయకత్వంలోనే మేము సమిష్టిగా పనిచేస్తాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. -జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే