తెలంగాణ

telangana

ETV Bharat / state

JAGGAREDDY: రేవంత్ తప్పేంలేదు.. అంతా నేనే చేశా.. అందుకే క్షమాపణలు చెప్పా - mla jaggareddy on revanth reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై నిన్న చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే, కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తప్పేం లేదని, తనదే తప్పని ఒప్పుకున్నానన్నారు. క్షమాపణలు కూడా చెప్పానని చెప్పారు. రేవంత్ రెడ్డి, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమన్న ఆయన.. నిన్నటి అంశం నిన్నటితోనే మరిచిపోవాలని కోరారు.

JAGGAREDDY: 'రేవంత్​, నేను అన్నదమ్ముల్లాంటి వాళ్లం.. నిన్నటి అంశం మరిచిపోండి'
JAGGAREDDY: 'రేవంత్​, నేను అన్నదమ్ముల్లాంటి వాళ్లం.. నిన్నటి అంశం మరిచిపోండి'

By

Published : Sep 25, 2021, 3:50 PM IST

హైదరాబాద్ గాంధీభవన్​లో కాంగ్రెస్​ సీనియర్​ ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ల సమావేశం వాడివేడిగా సాగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిల మధ్య వాదోపవాదాలు జరిగాయి. జగ్గారెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలను మల్లు రవి సమావేశంలో పరోక్షంగా ప్రస్తావించారు. తనను ప్రశ్నించడానికి మీకేం అర్హత ఉందంటూ జగ్గారెడ్డి మల్లు రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్​ను సీనియర్ ఉపాధ్యక్షుడు ఎలా ప్రశ్నిస్తారని మండిపడ్డారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడంతో బోసురాజు, శ్రీనివాస కృష్ణన్​లు ఇరువురు నేతలకు సర్దిచెప్పారు. అనంతరం వర్కింగ్​ ప్రెసిడెంట్లు​ మహేశ్​ కుమార్​ గౌడ్, జగ్గారెడ్డిలు​ మీడియాతో మాట్లాడారు.

జగ్గారెడ్డి నిన్న మాట్లాడిన మాటలపై సమావేశంలో చర్చించినట్లు మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. జగ్గారెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. సమాచారలోపంతోనే నిన్నటి వివాదం తలెత్తినట్లు పేర్కొన్నారు. జగ్గారెడ్డిపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేయలేదన్న మహేశ్​కుమార్​గౌడ్​.. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నిన్నటి ఎపిసోడ్​కు జగ్గారెడ్డి పుల్​స్టాప్​ పెట్టాడని మహేశ్​కుమార్​గౌడ్​ తెలిపారు. కింది క్యాడర్ పరేషాన్​ కానవసరం లేదన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర కమిటీలు పార్టీకి అవసరమని అన్నారు.

రేవంత్​, నేను అన్నదమ్ముల్లాంటి వాళ్లం..

రేవంత్ రెడ్డి, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తప్పేం లేదని, తనదే తప్పని ఒప్పుకున్నానన్నారు. క్షమాపణలు కూడా చెప్పానని చెప్పారు. నిన్నటి అంశం నిన్నటితోనే మరిచిపోవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడొద్దని పార్టీ ఇన్​ఛార్జీ చెప్పారన్న జగ్గారెడ్డి.. ఇకపై నేరుగా పార్టీ వ్యవహారాలు మీడియాతో మాట్లాడనన్నారు. అధికార తెరాసపైనే తమ యుద్ధమని స్పష్టం చేశారు.

అసలు శుక్రవారం జగ్గారెడ్డి ఏమన్నారంటే..

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను. నాకు గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. ఎవరి ఒత్తిడి మేరకు సభాధ్యక్షురాలు గీతారెడ్డి మాట్లాడటానికి నాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏమి జరుగుతుంది? ఒకరి నెత్తిన ఒకరు చెయ్యి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరు? ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాను. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేకుండా పోయింది. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు. చిరంజీవి, రజనీకాంత్​ లాంటి వారే కనుమరుగయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్లి పని చేయాలి. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ మద్ధతు లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తా. -ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంబంధిత కథనాలు..

'రాజకీయాల్లో హీరోయిజం ప‌నిచేయ‌దు.. చిరంజీవి, రజనీకాంత్​లే కనుమరుగయ్యారు'

Jaggareddy: రేవంత్​పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్​కి కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details