MLA Jagga Reddy comments on DGP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల శిక్షణ తరగతులకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తప్పుపట్టారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ శిక్షణ తరగతులకు అనుమతి ఇవ్వకపోవడంపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ కూడా స్పందించారు. ఇదే అంశంపై స్పందించిన జగ్గారెడ్డి... పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్ ట్వీట్ చేసినట్లు... భాజపాకు వర్తించని కొవిడ్ నిబంధనలు కాంగ్రెస్ మాత్రమే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు.
ఏఐసీసీ ఇంఛార్జి మాణికం ఠాగూర్ ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి కోసం దరఖాస్తులు చేశాం. కానీ ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని మాణికం తెలిపారు. అయితే ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతుల కోసం పర్మిషన్ ఇచ్చిన పోలీసులు... కాంగ్రెస్కు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు? ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందం ఇదేనా?
-జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
డీజీపీ స్పందించాలి..
కొవిడ్ నిబంధనలకు లోబడే తాము శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్న జగ్గారెడ్డి... కాంగ్రెస్కు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం లేదని అనుమతి ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్ సంఖ్య 150 కాగా... ఆర్ఎస్ఎస్ సంఖ్య 300 మందికి పైగా హాజరయ్యారన్నారు. పైగా వాళ్లు ఎక్కడా కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఠాగూర్ ట్వీట్ పై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.