Etela Rajender Respond on Budget: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బడ్జెట్ అంతా అంకెల గారడీయేనని ఆరోపించారు. ఈ కేటాయింపుల్లో 70-80 శాతం నిధులు విడుదల కావని చెప్పారు. ఉద్యోగులకు హౌసింగ్ రుణాల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. చాలా ప్రభుత్వ శాఖలకు కోతపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
విద్యాసంస్థల్లో ఆహారం, సిబ్బంది, సదుపాయాలు దారుణంగా మారాయని ఈటవల రాజేందర్ ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడు నెలల పాటు ధర్నా చేశారని గుర్తు చేశారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా పైసలు ఇవ్వడంలేదని విమర్శించారు. పైరవీలు చేసుకుంటేనే కాంట్రాక్టర్లకు బిల్లులిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ చేయాలని రైతులు కోరుతున్నారని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
మరోవైపు 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారు. మూలధన వ్యవయం రూ.2,11,685 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 37, 525 కోట్లు కేటాయించినట్లు హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రారంభిస్తోంది.. దేశం ఆచరిస్తోందని చెప్పారు. ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాలను తట్టుకుని రాష్ట్రం నిలబడిందని వివరించారు. సంక్షోభ సమయాల్లో సమర్థంగా ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందిందని హరీశ్ రావు వెల్లడించారు.
కేంద్ర సహకారం లేకపోయినా.. రాష్ట్రం గణనీయంగా ప్రగతి సాధిస్తోంది: తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదని హరీశ్ రావు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆటంకం కల్గిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర రుణపరిమితిని అసంబద్ధంగా తగ్గించిందని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర సహకారం లేకపోయినా రాష్ట్రం గణనీయంగా ప్రగతి సాధిస్తోందని హరీశ్ రావు వెల్లడించారు.