Etala Rajender Fires on BRS: సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి కంపెనీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. దీనిపై చర్చకు సిద్దమని.. బీఆర్ఎస్ సర్కారు తేదీ, సమయం చెబితే చర్చకు వస్తానని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు మాట్లాడారు.
MLA Etala on Singareni Privatization : బీజేపీపై బీఆర్ఎస్ సర్కారు పదే పదే విషాన్ని చిమ్ముతుందనీ ఈటల మండిపడ్డారు. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసే ఆలోచన తమకు లేదని రామగుండం గడ్డ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. సింగరేణి విధి విధానాలపై కేంద్రం జోక్యం చేసుకోలేదనీ.. రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసిందని తెలిపారు. సింగరేణి ప్రైవేటైజేషనా కోల్ మైన్ ప్రైవేటైజేషనా కేసీఆర్ సర్కారు చెప్పాలనీ డిమాండ్ చేశారు. బొగ్గు, మట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని.. ప్రభుత్వం ఎందుకు ఆ పనులు చేయడం లేదని ప్రశ్నించారు.
సింగరేణిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే ఈటల డిమాండ్ చేశారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేట్‌కి ఇచ్చి తవ్విస్తోంది నిజం కాదా అని ప్రశ్నించారు. కంపెనీకి ఇవ్వాల్సిన రూ. 20కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదనీ నిలదీశారు. విశాఖ గురించి ఆలోచిస్తున్న సీఎం కేసీఅర్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Etala Allegations on Revanth Reddy: ఆర్టీసీ, నిజాం షుగర్, అజాంజాహి మిల్లు తెలంగాణవి కాదా అని ఈటల ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పురోగమించే పార్టీ బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు రూ.25కోట్లు కేసీఆర్ ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని అన్నారు. ఎన్నికల ముందు లేదా తర్వాత రెండు పార్టీలు కలవడం ఖాయమని జోస్యం చెప్పారు.