రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వివాదంపై హైకోర్టులో విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి వద్ద ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. పౌరసత్వ చట్టాలను ఉల్లంఘించలేదని చెన్నమనేని రమేశ్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. భారత పౌరసత్వంతోనే జర్మనీ వెళ్లివచ్చినట్లు ఆయన తెలిపారు.
అయితే గత పన్నెండు నెలలుగా దేశంలో ఉండటం లేదు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వమే ఉందని.. ఇప్పటికీ ఆయన అక్కడే ఉంటున్నారని పిటిషన్ వేసిన ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ పేర్కొన్నారు. ఈ కేసులో చాలా పత్రాలు ఉన్నందున.. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు వీలుగా వాటన్నింటినీ ఒక పుస్తకం రూపంలో చేసి సమర్పించాలని ఇరువైపుల న్యాయవాదులను హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.