MLA Candidates Offers to Youth Groups :తెలంగాణలో ఎన్నికల ప్రచారం (Telangana Assembly Election Campaign) ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అభ్యర్థులు, అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు.. తమ అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ కోసం కొందరు.. మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు.
ఓ వైపు నామినేషన్ ప్రక్రియ జోరు మరోవైపు పార్టీల ప్రచార హోరు
ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో గోవా పేరు వినపడుతోంది. పార్టీ కోసం పనిచేసే.. యువజన బృందాలకు గెలిచిన తర్వాత గోవా టూర్‌కి పంపిస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో అభ్యర్థి గురించి సానుకూల ప్రచారం చేయడం, బైకు ర్యాలీలు, పోల్ చీటీల పంపిణీ వరకు వారి భాగస్వామ్యం అవసరం. యువత సైతం కొత్త కోరికల చిట్టాను అభ్యర్థుల ముందు పెడుతున్నారు.
Political Parties Election Campaign : ఇప్పటివరకు క్రికెట్, ఇతర క్రీడా సామగ్రి కిట్లు కావాలి? యవజన సంఘాలకు భవనాలు కట్టివ్వాలని యువజన బృందాలు కోరేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మీ కోసం తాము పనిచేస్తామని.. ఎన్నికలు ముగిసిన తర్వాత తమను గోవా టూర్‌కు పంపితే చాలని.. హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఒక ఎమ్మెల్యేను కోరారు. హైదరాబాద్ శివారులోని పలువురు అభ్యర్థులకు సైతం ఈ తరహా అనుభవమే ఎదురైంది. అయితే గెలవాలే గానీ అదెంత పని అంటూ.. అభ్యర్థులూ హామీ ఇస్తుండడంతో యువజన బృందాలు ప్రచారంలో స్పీడ్‌పెంచాయి.