mosquito prevention: జీహెచ్‌ఎంసీలో దోమల నివారణ కోసం ఫాగింగ్ విషయంలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పాతబస్తీ, ఎల్బీనగర్ దోమల నివారణ కార్యాలయ సిబ్బంది డీజిల్ కూపన్లను అమ్ముతూ పట్టుబడిన సంఘటన ఈ సంవత్సరం ప్రారంభంలో వెలుగులోకి వచ్చింది. కేంద్ర కార్యాలయం ఇంటర్నర్ ఇన్వెస్టిగేషన్లో ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలో దోమల నివారణ అధికారులు రోజుకు 5లక్షల రూపాయలు, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ జోన్లలో 3లక్షల విలువైన డీజిల్‌ను దారి విక్రయిస్తున్నారని తెలిసింది.
mosquito prevention in Hyderabad : జీహెచ్‌ఎంసీలో 6జోన్లు, 30సర్కిళ్లు ఉన్నాయి. దోమల పొగ కొట్టే(ఫాగింగ్ )యంత్రాల్లో టాటా ఏస్ వాహనంలో తిరిగే పెద్ద యంత్రం (వీఎంఎఫ్), చిన్న యంత్రం అనే 2రకాలు ఉన్నాయి. పెద్ద యంత్రాలు 63, చిన్న యంత్రాలు 302 ఉన్నాయి. 4సంవత్సరాలుగా పెద్ద వాటిని ప్రతి జోన్‌కు 10చొప్పున, చిన్న యంత్రాలను ఒక డివిజన్‌కు 2చొప్పున తిప్పుతున్నారు. ఫాగింగ్ యంత్రాల సామర్థ్యాన్ని బట్టి 90 లీటర్ల డీజిల్ పట్టే యంత్రానికి 14లీటర్లు పెట్రోలు, 4లీటర్ల మలాథియన్ టెక్నికల్ మందును కలుపుతారు. వీటన్నింటి మిశ్రమాన్ని యంత్రంలో వేయడం వల్ల దోమల పొగ ఉత్పత్తి అవుతుంది. ఆ పొగను స్ప్రే చేస్తే దోమలు నీరసించి పడిపోతాయి. దీని వల్ల చాలా వరకు దోమలు నశిస్తాయి. దోమల వల్ల ప్రజలకు ఉపశమనం జరుగుతుంది.
అధికారుల చేతివాటం: ఇలా ఫాగ్ స్ప్రే చేసే సమయంలోనే కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. శేరిలింగంపల్లి జోన్లో ఒక యంత్రం 90 లీటర్లు డీజిల్‌తో నడుస్తుండగా, మిగిలిన యంత్రాలన్నీ 45లీటర్లు, 25 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. మిగిలిన అన్ని జోన్లలో మాత్రం అన్ని యంత్రాలు 60లీటర్ల నుంచి 90లీటర్ల సామర్థ్యం కలవి. అయితే ఒక్కో ఫాగింగ్ యంత్రం ఎంత దూరం ఫాగింగ్ చేసిందనే లెక్కలు చూశారు. అయితే దానిలో శేరిలింగంపల్లి జోన్లోనే లెక్క సరిపోతున్నట్లు.. మిగిలిన జోన్లలో డీజిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తూ.. తక్కువ ఫాగింగ్ చేస్తున్నట్లు సెంట్రల్ ఆఫీస్ చేసిన అంతర్గత విచారణలో తేలింది.