Mission Electrification Indian Railways : దేశంలోని పస్తుత అన్ని బ్రాడ్ గేజ్ మార్గాలను డిసెంబర్ 2023 నాటికి విద్యుదీకరణ చేయాలనే లక్ష్యంతో మిషన్ ఎలక్ట్రిఫికేషన్ పేరుతో భారతీయ రైల్వే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే... మిషన్ ఎలక్ట్రిఫికేషన్ పేరిట విద్యుదీకరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. అందులో భాగంగా గద్వాల-రాయచూర్ మధ్య సెక్షన్‌లో 57.70 కిమీల దూరం గల నూతన రైల్వే లైన్ 2013లో ఏర్పాటైంది. రూ.46 కోట్ల అంచనా వ్యయంతో 2018-19 సంవత్సరంలో ఈ లైన్ విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరైంది. ఈ లైన్‌తో రెండు ప్రధాన సెక్షన్లయిన సికింద్రాబాద్-ఢోన్, వాడీ-గుంతకల్ మధ్య తక్కువ దూరంతో నేరుగా రైల్ అనుసంధానం ఏర్పడుతుందని రైల్వే శాఖ పేర్కొంది. మొత్తం 57.70 కి.మీలలో 37 కిమీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండగా... మిగిలిన 20.70 కి.మీలు కర్ణాటక రాష్ట్రానికి చెందింది. ప్రస్తుతం సెక్షన్ మొత్తంలో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని ద.మ.రైల్వే తెలిపింది.
శరవేగంగా పనులు
వికారాబాద్-పర్లి సెక్షన్ లో 269 కిమీల్లో... కోహీర్ డక్కన్-ఖానాపూర్ మధ్య 60.40 కిమీ మేర దూరం గల రైల్వే లైన్ 2018-19 సంవత్సరంలో రూ.262 కోట్ల అంచనా వ్యయంతో విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరైంది. వికారాబాద్- కోహీర్ డక్కన్ మధ్య 45 కిమీల భాగంలో పనులు మార్చి 2021లో పూర్తికావడంతో పాటు.. వాటిని ప్రారంభించారు. వీటిలో మొత్తం 60.4 కిమీల్లో 26.7 కి.మీలు కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉండగా, 33.7 కి.మీలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు కోహీర్ - ఖానాపూర్ మధ్య 60.4 కిమీల విద్యుదీకరణ పూర్తి కావడంతో మొత్తం 105 కిమీలలో రైల్వే లైన్ నిరాటంకంగా ఎలక్ట్రిక్ ట్రాక్షన్ పరిధిలోకి వస్తుంది. ఇకమీదట బీదర్ నుంచి ప్రారంభమయ్యే రైళ్లు, ఆ ప్రాంతం మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఇప్పుడు విద్యుత్ ఇంజిన్‌తో నడుస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.