Telangana Decade Celebrations 2023 : రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. మిషన్ భగీరథ పెట్టినప్పటి నుంచి తెలంగాణ ఆడబిడ్డలకు నీటి కష్టాలు తప్పాయి. ఒకప్పుడు నీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ మహిళలు.. ఇప్పుడు ఇంటికే నీరు వస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతి ఇంటికి తాగు నీటిని సప్లై చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కాగా ఈ సంవత్సరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు మంచి నీళ్ల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటిని ఎలా శుభ్రం చేస్తారు అని వారికి తెలియజేస్తున్నారు. నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి అని సూచనలిస్తున్నారు.
పొయ్యి కాడికే నీళ్లు..: స్వరాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీరాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛ జలాలువచ్చేశాయి. 100 శాతం తాగు నీటిని అందిస్తున్న అతిపెద్ద ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించిన నేపథ్యంలో రాష్ట్రంలో "మంచి నీళ్ల పండుగ" ఘనంగా సాగుతోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఊరూ వాడా ప్రశాంత వాతావరణం నడుమ మంచినీళ్ల పండుగ ఉత్సాహపూరితంగా మొదలైంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.