Mission Bhagiratha: జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని... రాబోయే మూడు నెలల పాటు ఇంజినీర్లందరూ పూర్తి అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి అన్నారు. అన్ని జిల్లాల ఇంజినీర్లతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో ఈ మేరకు దిశానిర్ధేశం చేశారు. ఇన్ టేక్ వెల్స్, ట్రీట్ మెంట్ ప్లాంట్లు, పంపింగ్ స్టేషన్లను ఈఈ స్థాయి అధికారులు తరచుగా పరిశీలించాలని తెలిపారు.
అటవీ ప్రాంతాల్లోని ఆవాసాలకు...
మోటార్లు, పంపులకు ఏమైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే సరిచేయాలని ఈఎన్సీ పేర్కొన్నారు. భగీరథ పైప్‌లైన్ వ్యవస్థ, ఎయిర్ వాల్వ్‌ల తనిఖీ ప్రక్రియ నిరంతరంగా జరగాలని... ఎలక్ట్రో మెకానికల్ సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల ఆవాసాలకు తాగునీటి సరాఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కొత్తగా ఏర్పాటు చేసుకునే ఆవాసాలకు కూడా సాధ్యమైనంత త్వరగా నీటిని సరాఫరా చేయాలని కృపాకర్‌రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు.