ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఒక రిటైర్డ్ కానిస్టేబులుకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా చిన్నకొడుకు ఇక్కడే ఉంటున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు తండ్రి అదృశ్యమయ్యారు. నాలుగైదు రోజులపాటు చుట్టుపక్కల దేవులాడిన కుమారుడు ఆచూకీ దొరకకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మతిస్థిమితం సరిగా లేని తండ్రి ఏమైపోయారో అనే బెంగతో పెద్దకుమారుడు కూడా ఉన్నపళంగా అమెరికా నుంచి నగరానికి చేరుకుని వెతకడం మొదలుపెట్టారు.
వారంపాటు గల్లీ గల్లీ గాలించగా చివరకు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని ఓ ఆశ్రమం వాళ్లు ఆయనను చేరదీసినట్లు తెలుసుకుని వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ తండ్రిని చూస్తూనే కన్నీటిపర్యంతమయ్యారు. కాళ్లు కడిగి దణ్నం పెట్టి తండ్రిని ఎత్తుకుని మరీ ఇంటికి తీసుకువెళ్లారు. ఆయన దొరికే వరకు పది, పదిహేను రోజుల పాటు వారు పడిన ఆవేదన వర్ణనాతీతం. స్వయంగా వారు గాలించారు కనుక ఆచూకీ దొరికింది. నిత్యం అనేక పనుల ఒత్తిడిలో ఉండే పోలీసులు ఇలా ఒకొక్కరిని వెతికి పట్టుకోవడం ఎలా సాధ్యం?
అందుకే.. నిత్యం ఎంతోమంది అదృశ్యమవుతున్నా చాలామంది ఆచూకీ దొరకడంలేదు!
అలా ఆచూకీ దొరకనివారి సంఖ్య ఏటా కనీసం రెండు, మూడు వేలు!
కుటుంబ సభ్యుల ఆవేదన
కుటుంబంలో ఎవరైనా కనిపించకుండా పోతే ఆ కుటుంబసభ్యుల ఆవేదన వర్ణనాతీతం. అదృశ్యమైంది చిన్నపిల్లలో, వృద్ధులో అయితే ఆ బాధ మరింత తీవ్రం. ఎదిగిన ఆడపిల్లలో, మహిళలో గడప దాటిపోతే పోలీసు కేసు వరకు వెళితే ఏమవుతుందో అనే భయం ఒకవైపు.. ఫిర్యాదు చేయకపోతే ఏ ఆపదలో చిక్కుకుంటారో అనే ఆందోళన మరోవైపు పట్టి పీడిస్తుంటాయి. ఇలా అయినవాళ్ల ఆచూకీ దొరకక తల్లడిల్లిపోతున్న కుటుంబాలు ఎన్నో!
కారణాలేమిటంటే..
పోలీసుల దర్యాప్తు, కుటుంబసభ్యుల ప్రయత్నాలు ఫలించి ఏటా సగటున 85 శాతంమంది తిరిగి వస్తుండటం ఊరట కలిగిస్తోంది. మిగిలిన 15 శాతం మంది జాడ మాత్రం తెలియడంలేదు.
*అదృశ్యం కేసుల్లో 16-35 ఏళ్ల వయస్కులవే ఎక్కువ ఉంటున్నాయి. వీరిలోనూ బాలికలు, మహిళలు ఎక్కువ. కుటుంబ విభేదాలు లేదా పెద్దల భయంతోనే చాలామంది మాయమవువుతున్నారు.
*యుక్త, మధ్య వయస్కుల అదృశ్యం ఘటనలకు ఎక్కువగా ప్రేమ, వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైనవారి పట్ల ఆకర్షితులై కొందరు గడప దాటుతున్నారు.
*పరీక్షల్లో మార్కులు సరిగా రాలేదనే కారణంతో చిన్నారులు మాయమవుతుంటే.. ఆర్థిక ఇబ్బందులతో పలువురు మధ్య వయస్కులు ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు.
*వృద్ధుల అదృశ్యానికి పిల్లలు తమను సరిగా చూడటం లేదనేదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మతిస్థిమితం సరిగా లేకపోవడమూ మరో కారణంగా ఉంది.