ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రామప్పు దేవాలయాన్ని యునెస్కో గుర్తించిన నేపథ్యంలో దేవాలయం పరిసర ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి... ఎలా చేయాలి అనే అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఆర్కియాలాజీ, సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్రం పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర పరిధిలో ఉండే అంశాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
దేశంలోనే అద్భుతమైన హెరిటేజ్ ప్రదేశంగా రామప్ప గుడిని తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఒక్క రామప్ప గుడిని మాత్రమే కాకుండా వేయి స్థంభాల గుడితో పాటు కాకతీయుల నాటి దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు రామప్ప గుడితో పాటు ఇతర దేవాలయాలను వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే అధికారులతో కలిసి రామప్ప గుడిని సందర్శించి గుడి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందజేయన్నట్లు మంత్రి వివరించారు.