ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా విద్యుత్ శాఖ లెక్కలపై మంత్రి జగదీశ్ రెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2071 యూనిట్లని తెలిపారు. దేశ సగటు 1208 యూనిట్లు కాగా దేశ సగటు కంటే 71 శాతం అధికంగా రాష్ట్రంలో వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తోన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని వివరించారు.
గంటల్లోపే పునరుద్ధరణ..
ప్రస్తుతం 355 సబ్‌స్టేషన్లు, 33-11 కేవీ సబ్‌స్టేషన్లు 3093, 7 లక్షల 62 వేల ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్‌ను గంటల్లోపే చేసి.. అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. పాతబస్తీలో విద్యుత్ పనులకు రూ. 380 కోట్లు వెచ్చించామని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో సమస్యలున్నా వెంటనే పరిష్కరిస్తున్నామని జగదీశ్ రెడ్డి వివరించారు.