అన్న వరసైన మృగాడు పైశాచికంగా చేసిన దాడిలో గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చిన ఘటన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఈ బాలికపై పెద్దమ్మ కొడుకైన మోహన్ కుమార్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మూడు నెలల కిందట వెలుగుచూసింది. అప్పటికే బాలిక ఆరు నెలల గర్భవతి అవడం వల్ల స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో బాలికను ఉంచారు. నిందితుడు మోహన్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాలికకు నెలలు నిండడం వల్ల ఇటీవల మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె రక్తహీనత, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నందున విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి.. గురువారం శస్త్రచికిత్స చేశారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రక్తహీనత సమస్య అధికంగా ఉండడం వల్ల మరికొన్ని రోజులు వారిని ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు సూచించారు.