Ministers Sub Committee Meeting With VRAs : వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం సంప్రదింపులు ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన ఉపసంఘం.. ఈరోజు తొలిసారి సమావేశమైంది.ఈ భేటీలో వారిని రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని, అలాగే జూనియర్ అసిస్టెంట్ కేడర్ వేతన స్కేలు ఇవ్వాలని వీఆర్ఏలు కోరినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్ సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీఆర్ఏ ఐకాస ప్రతినిధులతో ఉపసంఘం చర్చలు జరిపింది. అందుకు అనుగుణంగా వారి నుంచి ఉపసంఘం అభిప్రాయాలు స్వీకరించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం అయిన వాళ్లతో పాటు వారసత్వంగా వచ్చిన వారు ఉన్నారని.. ఎక్కువ మంది బలహీనవర్గాల వారే ఉన్నారని ఐకాస మంత్రులకు వివరించింది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని.. మరోదఫా చర్చించి ముఖ్యమంత్రికి నివేదిస్తామని మంత్రులు తెలిపారు.
నీటి పారుదల శాఖలో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలి : వీఆర్ఏల సర్దుబాటు అంశంపై మంగళవారం ప్రగతిభవన్లో మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వీఆర్ఏలను విద్యార్హతలు, సామర్థ్యాలను అనుసరించి నీటి పారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. అందుకు గానూ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘంలో జగదీశ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్లను సభ్యులుగా నియమించారు.