Shirdi buses in Telangana tourism : తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.అందులో భాగంగా దేశ, విదేశీ టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, షిర్డికి రెండు ఏసీ స్లీపర్ బస్సులను.. రవీంద్రభారతిలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
హైదరాబాద్ సిటీ సైట్సీన్ కోసం ఏసీ మినీబస్లను ఏర్పాటుచేశారు. గతంలో ఈ రూట్లలో స్లీపర్ బస్సులు ఉన్నప్పటికీ.. ప్రయాణికుల డిమాండ్ మేరకు మరో రెండు బస్సులను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. తెలంగాణ టూరిజం అంటే ప్రజల్లో నమ్మకం ఉందని.. ఆ నమ్మకాన్ని అలాగే ముందుకు కొనసాగిస్తామని తెలిపారు.
రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇతర ప్రాజెక్టులు, ముఖ్యమైన ప్రదేశాలను టూరిజం హబ్‌గా మారుస్తామన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలోని దర్శనీయ ప్రదేశాలను సర్క్యూట్ల్గా ఏర్పాటుచేసి.. టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
మెడికల్ టూరిజం అభివృద్ధి.. రాష్ట్ర ఆతిథ్యం కోసం ఇతర దేశాలు పౌరులు తెలంగాణకు వస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు శిక్షణ మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ప్రారంభించారు. అనతికాలంలోనే తెలంగాణలో మెడికల్ టూరిజం బాగా అభివృద్ధి చెందిందని మంత్రి అన్నారు.