తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Decade Celebrations : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కసరత్తు ముమ్మరం.. నేడు తుదిరూపు

Ministers Review on Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రులు ఆయా శాఖల అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. మూడు వారాల పాటు వివిధ రంగాల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేశారు. మంత్రులు, అధికారులతో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై నిర్వహణా ప్రణాళికకు తుది రూపు ఇవ్వనున్నారు

Telangana Decade Celebrations
Telangana Decade Celebrations

By

Published : May 19, 2023, 7:38 PM IST

Updated : May 20, 2023, 6:42 AM IST

Ministers Review on Telangana Decade Celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మంత్రులు సత్యవతి రాఠోడ్‌, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. వేడుకల నిర్వహణపై మంత్రులు అధికారులతో సమాలోచనలు జరిపారు.

కనీవినీ ఎరుగని రీతిలో వేడుకల నిర్వహణ..: రాష్ట్రావ‌త‌రణ ద‌శాబ్ది ఉత్సవాల‌ను ఊరూరా పండగ‌లా.. ఘ‌నంగా నిర్వహించాల‌ని, ప్రజలను భాగస్వాములను చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సచివాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. కనీవినీ ఎరగని రీతిలో వేడుకలు నిర్వహించాలన్న మంత్రి ఎర్రబెల్లి.. గ్రామాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని 23 రోజుల పాటు ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాల‌న్నారు. ప‌దేళ్లల్లో ఏ ఏ ప‌థ‌కాలు వ‌చ్చాయి.. వాటి ఫలాల వల్ల జరిగిన ప్రయోజనం వివరించాలని సూచించారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో న‌ర్సరీలు, డంపింగ్ యార్డులు, క‌ల్లాలు, రైతు వేదిక‌లు, శ్మశాన వాటిక‌లు, ప‌ల్లె ప్రకృతి వ‌నాలు, క్రీడా ప్రాంగ‌ణాలు ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆ అభివృద్ధిపై దండోరా వేసి ప్రజలకు తెలియజెప్పాలన్నారు.

విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా కార్యక్రమాల రూపకల్పన..: దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ యంత్రాంగానికి సూచించారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష చేసిన మంత్రి కొప్పుల.. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో సంక్షేమ పథకాల లబ్దిదారులను భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా డాక్యుమెంటరీ, ఫొటో ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. గురుకుల విద్యార్థులు సాధించిన ప్రతిభను కళ్లకు కట్టేలా దృశ్యరూపకంగా చూపించాలన్నారు. సంక్షేమ పథకాలపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

ఆ శాఖ నుంచి వచ్చిన సూచనలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం..: దశాబ్ది ఉత్సవాలపై సచివాలయం మూడో అంతస్తులోని సమావేశ మందిరంలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల కరెంట్‌ సరఫరా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, ఐదేళ్లలో రైతుబంధు ద్వారా పది విడతల్లో నేరుగా రూ.65 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. వ్యవసాయ శాఖ వివిధ విభాగాల నుంచి వచ్చిన సూచనలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు పదేళ్లలో ప్రభుత్వం పురోభివృద్ధికి దోహదపడిన అంశాలు, విజయాలు భిన్న కార్యక్రమాల ద్వారా చాటి చెబుతామని మంత్రి పిలుపునిచ్చారు.

ఉత్సవాల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులను భాగస్వామ్యం చేస్తాం..: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులను భాగస్వాములను చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లలో దేశం గర్వించదగ్గ స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తామని మంత్రి ప్రశాంత్​రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 20, 2023, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details