Talasani Review on Dogs Attack in Telangana: రాష్ట్రంలో వీధి కుక్కల విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశు భవన్లో వీధి కుక్కల బెడదపై హోం శాఖ మంత్రి మహమూద్ అలీతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో... ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్య, నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై పురపాలక, పశుసంవర్ధక శాఖల అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
మూగజీవాలైన వీధి కుక్కల బెడద విషయంలో ప్రభుత్వం, పురపాలక శాఖ, పశుసంవర్ధక శాఖ, జీహెచ్ఎంసీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడి వల్ల చనిపోయిన నేపథ్యంలో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో విపక్షాలు వ్యతిరేకత కోణంలో చూస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని తలసాని ధ్వజమెత్తారు. జంట నగరాల్లో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా ఆధునిక టెక్నాలజీ కూడా అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు.
'రోడ్లపై ఇష్టం వచ్చినట్లు మాంసం వేయవద్దు. అవసరమైతే రాత్రి సమయాల్లో మున్సిపల్ సిబ్బంది డ్యూటీ చేస్తారు. మూడు నెలల్లో కుక్కలు, కోతుల దాడులను తగ్గిస్తాం. ఎవరైనా సూచనలు చేస్తే స్వీకరిస్తాం. కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటాం.'-తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్థక శాఖ మంత్రి