బతుకమ్మ చిరుకానుకగా అక్టోబర్ 9 నుంచి ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ ఏడాది 287 డిజైన్లలో వెండి, బంగారు జరీ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. 317కోట్ల 81 లక్షలతో దాదాపు కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా దృష్ట్యా స్థానిక మహిళా సంఘాల ద్వారా చీరలు అందిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమ మరింత ముందుకు వెళ్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది 287 డిజైన్లలో బతుకమ్మ చీరలు: మంత్రి కేటీఆర్ - బతుకమ్మ చీరల పంపిణీ
ఏటా ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చిరుకానుకగా అందిస్తున్న చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. అక్టోబర్ 9 నుంచి చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సారి 287 డిజైన్లలో వెండి, బంగారు జరీతో దాదాపు కోటి చీరలు మహిళలకు అందించనున్నామని కేటీఆర్ తెలిపారు.
బతుకమ్మ చీరలకు ఓ ప్రత్యేక బ్రాండింగ్ ఏర్పాటు చేసి మార్కెట్లోకి తీసుకురావటం ద్వారా పవర్లూమ్ నేతన్నలకు మరింత ఆదాయం చేకూర్చే విధంగా ఆలోచించాలని చేనేత, జౌళి శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బతుకమ్మ చీరను ఆడబిడ్డలకు సారెగా ఇవ్వటంతోపాటు.. నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మహిళలను చీరలు నచ్చాయా అని అడిగిన కేటీఆర్.. ఆడవారికి నచ్చే చీరలు తేవటం భర్తలకే కష్టమని ఇక ప్రభుత్వం వల్ల అవుతుందా అంటూ ఛలోక్తులు విసిరారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి బతుకమ్మ చీరల సొగసును మెచ్చుకున్నారు. నేతన్నలకు కేసీఆర్ ఎప్పుడూ సాయంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ