కృష్ణా నదిలో నీటి హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని... మా నీటిని ఎలా తీసుకోవాలో మాకు తెలుసని మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఏపీ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లో ఆపుతామని అన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయం తన నివాసంలో మంత్రి మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి రోజు మూడు టీఎంసీలు నీరు తరలించేందుకు... రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపకల్పన, నిర్మాణం పూర్తి చట్ట, రాజ్యాంగ విరుద్ధమని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వీధి పోరాటాలు ఉండవన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాలని సూచించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్న జల వనరులు ముందు చూపుతో వాడుకుందామన్న కోణంలో తెలంగాణ ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్‌కు స్నేహ హస్తం అందించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏమైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే.. కేంద్రం అనుమతి తీసుకుని నీటి కేటాయింపులు చేసుకోవాలి తప్ప... ఇష్టా రాజ్యంగా మొండి వైఖరి ప్రదర్శిస్తే తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన దృష్ట్యా... ఇరు రాష్ట్రాలను పిలిచి సామరస్యంగా పరిష్కరించవచ్చని నిరంజన్‌రెడ్డి అన్నారు. రెండు కొట్లాడుకోవాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. సాధారణంగా ఇలాంటి వివాదాలు ఉత్పన్నమైనప్పుడు వాటర్ బోర్డ్ మేనేజ్మెంట్ సుమోటోగా వెళ్లి తనిఖీ చేస్తే ప్రభుత్వ పధాన కార్యదర్శి జైలుకు వెళ్లరా అని ప్రశ్నించారు.
న్యాయస్థానంలో స్టే ఉండగా రాయసీమ ప్రాజెక్టులు పనులు ఎలా చేస్తారని మంత్రి ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు నుంచి ఆరు టీఎంసీలు... ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున జోగులాంబ బ్యారేజీ వద్ద నీరు ఆపుకుంటామని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. దాబాయింపు మాటలు చెల్లుబాటు కావని ఎద్దేవా చేశారు. మీ వైఖరి ఏందో చెప్పాలని కోరారు. తెలంగాణ మీ పాలనలో ఉన్న సమైక్యం రాష్ట్రం కాదని నిరంజన్‌రెడ్డి చెప్పారు. దబాయించైనా జోగులాంబ ఆనకట్టను కడతామని.. ఎవరు అడ్డొస్తారో చూసుకుంటామని వెల్లడించారు.