రైతుల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోందని మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది వానా కాలం పెద్ద ఎత్తున పత్తి పంట సాగవుతున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.
'రైతుల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోంది' - జిన్నింగ్ మిల్స్ ప్రతినిధులపై మంత్రుల సమీక్ష
జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.
ఈసారి పెద్ద ఎత్తున పత్తి పంట ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలతో సిద్ధంగా ఉందని మంత్రులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మంచి డిమాండ్, ధర లభించే తీరుగా ప్రయత్నాలు ప్రారంభించిందని గుర్తు చేశారు.
పెద్ద ఎత్తున పంట వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత మిల్లులపై కూడా ఉందని మంత్రులు చెప్పారు. 323 జిన్నింగ్ మిల్లుల్లో 150కి పైగా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నెలకొల్పబడ్డాయని... ఇది ప్రభుత్వం పట్ల తమ పరిశ్రమకున్న విశ్వాసం చూపుతోందని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలు మంత్రులకు తెలిపాయి.