కవి, సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి 89వ జయంతిని హైదరాబాద్లోని బంజారాహిల్స్‌లో ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో నిర్మించబోయే సినారె సారస్వత సదనం ఆడిటోరియానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేసి, ఆడిటోరియం నమూనాను ఆవిష్కరించారు. ఈ ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం సత్వరమే రూ.10 కోట్లు విడుదల చేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కళలు, కళాకారులను ప్రోత్సహించేలా ప్రత్యేక చొరవతో ముందుకెళ్తున్నామని ఆయన అన్నారు.
వారికిచ్చే గౌరవం
ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ కలగలిపిన బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె అని మంత్రి కేటీఆర్ అన్నారు. సాహిత్య లోకానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ.. కొన్ని సాహితీ పంక్తులను ఆయన నెమరవేశారు. నగరం నడిబొడ్డున ఈ సాంస్కృతిక ఇండోర్ ఆడిటోరియం నిర్మాణం.. సినారె వంటి వైతాళికులకు ఇచ్చే గౌరవమని, తెలంగాణ కవులు, కళాకారులకు ఇదొక కొత్త వేదికవుతుందని కేటీఆర్ అన్నారు.