Ministers on BRS Formation Day: తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన గులాబీ పార్టీ నేడు 22 సంత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునః ప్రతిష్టించిందని పేర్కొన్నారు. అనతికాలంలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిపారని వివరించారు. ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
"రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీగా పురుడుపోసుకుంది. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించింది. అనతికాలంలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత కేసీఆర్. 22 ఏళ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, ప్రజలకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు." - కేటీఆర్, మంత్రి
దేశానికే రోల్ మోడల్‌గా: స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్ అని.. ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్‌ఎస్ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలో 22 ఏళ్ల క్రితం ఉద్యమ పార్టీ పురుడు పోసుకుందని అన్నారు. ఈ క్రమంలోనే స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని తెలిపారు. అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలుస్తూ.. దేశానికే రోల్ మోడల్‌గా మారిందని హరీశ్‌రావు వివరించారు.
అగ్రస్థానంలో రాష్ట్రం: సంక్షేమం.. అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికిందంటూ హరీశ్‌రావు కొనియాడారు. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారంటూ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం తలపెట్టిన మహాయజ్ఞంలో భాగంగా.. జాతీయ స్థాయిలో విస్తరించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.