High Level Meeting on Fire Accidents in Hyderabad : సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లోని దక్కన్‌మాల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో ఫైర్ సేఫ్టీపై ప్రభుత్వం దృష్టి సారించింది. అగ్నిప్రమాద నివారణ అనుమతుల్లేని భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్ బీఆర్కేభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో.. భారీ భవనాలకు అగ్నిమాపక రక్షణ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు.
Fire Accidents in Hyderabad : పురపాలక, పోలీసులు, అగ్నిమాపక అధికారులు సమన్వయంతో పని చేసి.. సకాలంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆసుపత్రులు, పాఠశాల భవనాలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములు, వ్యాపార, వాణిజ్య భవనాలు, ఎత్తైన అపార్టుమెంట్లపైనా దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అగ్నిమాపక ఆడిటింగ్ జరగాలన్నారు. 1999లో రూపొందించిన ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చేందుకు తగు ప్రతిపాదనలను పంపించాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. ఆధునిక వాహనాలు, అగ్నిమాపక యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సికింద్రాబాద్ ఘటనలో భారీ ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని కేటీఆర్ అభినందించారు. దక్కన్‌మాల్ అగ్ని ప్రమాదంలో గల్లంతైన ముగ్గురి కుటుంబాలకు తలా రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.