తెలంగాణ

telangana

ETV Bharat / state

అవార్డులిచ్చారు... మరి నిధుల సంగతేంటి?: కేంద్రంపై మంత్రుల ఫైర్ - Minister Harish on Center Fire

తెలంగాణ రాష్ట్రం తాజాగా ఇంటింటికీ శుద్ధచేసిన తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్న "మిషన్​ భగీరథ" పథకానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. అయితే దీనిపై మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. అవార్డులు ఇస్తే సరిపోదు.. నిధులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగిలిన తెలంగాణ పథకాలు కూడా కాపీ కొట్టాలని సలహా ఇచ్చారు.

Harish and errabelli
Harish and errabelli

By

Published : Sep 29, 2022, 1:02 PM IST

అవార్డులిస్తే సరిపోదు... మరి నిధుల సంగతేంటి?: కేంద్రంపై మంత్రులు ఫైర్

తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను దిల్లీలో ప్రశంసిస్తూ గల్లీలో విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రులు... దమ్ముంటే రాష్ట్రానికి నిధులిచ్చి వాటా గురించి మాట్లాడాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్ చేశారు. ఓ వైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు ప్రభుత్వ పనితీరు బాగోలేదని, అవినీతి అని గల్లీల్లో రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఇప్పటికే నాలుగు తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్న ఆయన... మిగిలిన పథకాలను కూడా కాపీ కొట్టి ఉచితవిద్యుత్, రైతుబంధు లాంటి వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.

''కేంద్రమంత్రులు దిల్లీలో ప్రశంసలు... గల్లీలో విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు అవార్డులు ఇస్తూ... మరోవైపు అవినీతి జరిగిందని అంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా అవార్డులు ఇస్తూ... గల్లీలో రాజకీయ విమర్శలా? పథకాలకు నిధులు ఇచ్చి వాటా గురించి మాట్లాడాలి. 15 వ ఆర్థికసంఘం ఇచ్చిన నివేదికలను కేంద్రం తుంగలో తొక్కుతోంది. నిధులు ఇచ్చి కేంద్రమంత్రులు మాట్లాడాలి.'' - మంత్రి హరీశ్‌రావు

రెండు రోజులకో మారు రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు... తెలంగాణ పథకాలను చూసి నేర్చుకోవాలని హరీశ్‌ రావు హితవు పలికారు. తెలంగాణకు 5,300 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలన్న 15వ ఆర్థికసంఘం నివేదికను, మిషన్ భగీరథకు 19వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఅయోగ్ సిఫారసులను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... జల్‌జీవన్‌మిషన్‌కు బూస్ట్‌లా పనిచేస్తోందన్న ప్రశంసలు తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం కాకుండా, శాశ్వత పరిష్కారం చూపిస్తున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్న నాయకులు ఎక్కడైనా నీళ్లు, కరెంట్ గురించి మాట్లాడుతున్నారా అని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

''కేంద్రమంత్రులు తెలంగాణలో నేర్చుకొని ఇక్కడి పథకాలు అమలు చేయాలి. ఇప్పటికే 4 తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. మిగిలిన పథకాలను కూడా కాపీ కొట్టి అమలు చేయాలి. ఉచిత విద్యుత్, రైతుబంధు లాంటివి దేశవ్యాప్తంగా అమలు చేయాలి. జల్‌జీవన్ మిషన్‌కు మిషన్ భగీరథ బూస్ట్‌లాగా పనిచేస్తోందని కేంద్రం పేర్కొంది. రెండ్రోజులకు ఒక కేంద్రమంత్రి వచ్చి విమర్శలు చేస్తున్నారు. సమస్యలకు కేసీఆర్‌ శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నారు. దేశం అంతటా తెలంగాణ మోడల్ వైపు చూస్తోంది.'' - మంత్రి హరీశ్‌రావు

కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ... అవార్డుల పంటతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న ఆయన... కేంద్రం అవార్డులు ఇవ్వడమే కాదు నిధులు కూడా ఇవ్వాలని సూచించారు. నిధుల విషయంలో కేంద్రం తెలంగాణను మోసం చేసిందన్న ఎర్రబెల్లి... తెలంగాణ మిషన్ భగీరథను కూడా తామే చేసినట్లు కేంద్రం గొప్పగా చెప్పుకుంటుందని దయాకర్ రావు మండిపడ్డారు.

''తెలంగాణ రాష్ట్రానికి వచ్చినన్ని అవార్డులు ఏ రాష్ట్రానికి రాలేదు. కేంద్రం.. ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు పెట్టినా అవార్డుల పంట పండుతోంది. అన్ని శాఖల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉంది. అసెంబ్లీలో ఇవాళ నీళ్లు, కరెంట్ గురించి మాట్లాడే వ్యక్తి లేరు. 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేంద్రం అవార్డులు ఇవ్వడమే కాదు.. నిధులు కూడా ఇవ్వాలి. నిధుల విషయంలో కేంద్రం తెలంగాణను మోసం చేస్తోంది''. -మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఇవీ చూడండి:

మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వ అవార్డు.. కేటీఆర్ సెటైర్!

అబార్షన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ABOUT THE AUTHOR

...view details