2014 నుంచి 2018 వరకు 4,702 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. 1,853 మంది మాత్రమే చనిపోయినట్లు రిపోర్టు అందిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా చనిపోయినట్లు సమాచారం అందగానే... మండలి స్థాయిలో త్రిసభ్య కమిటీ నిజనిజాలు నిర్ధారిస్తుందని తెలిపారు. అలా 1,125 మంది రైతులు మృతి చెందినట్లు నిర్ధారించుకున్నామని చెప్పారు. వారందరికీ ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందించామని వెల్లడించారు.
'రైతు ఆత్మహత్య అనే పదం వినిపించకుండా చేస్తాం'
రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు 100 శాతం అమలవుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అన్నదాతకు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని వెల్లడించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు అనే పదం వినిపించకుండా చేస్తామని స్పష్టం చేశారు.
రైతుబంధు సాంకేతిక సమస్యల వల్ల రావట్లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అడగగా... వాటిని సరిచేసి అర్హులైన వారి ఖాతాల్లో నగదు జమ చేశామని మంత్రి వేముల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించారని వెల్లడించారు. ఇంకా ఎవరికైనా రాకపోతే కచ్చితంగా వారికి అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే నాయకుడు కాదని... ఆయన స్వయానా రైతుబిడ్డ అని వెల్లడించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు అనే పదం వినిపించకుండా చేసేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:భాగ్యనగరంలో నిరంతరం నీటి సరఫరాకు ప్రణాళికలు: కేటీఆర్