తెలంగాణ

telangana

ETV Bharat / state

SECRETARIAT WORKS: సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల - minister vemula visited secretariat works

నూతన సచివాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులు, గుత్తేదారును ఆదేశించారు. గుత్తేదారు కార్మికుల కోసం నిర్వహించిన విశ్వకర్మ పూజలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో.. చారిత్రక కట్టడాన్ని తలపించేలా సచివాలయం రూపుదిద్దుకుంటోంది.

SECRETARIAT WORKS
సచివాలయ నిర్మాణం

By

Published : Sep 17, 2021, 7:06 PM IST

Updated : Sep 17, 2021, 7:27 PM IST

సచివాలయ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచాలని... ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారుకు రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గుత్తేదారు కార్మికుల కోసం నిర్వహించిన విశ్వకర్మ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి... సచివాలయ నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. వర్క్ చార్ట్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో అన్న అంశాలను ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

నిర్మాణ ప్రాంతంలో అన్ని విభాగాల నుంచి బ్లాక్​ల వారీగా తనిఖీ చేశారు. భవనం ముందు భాగం మూడు, వెనకవైపు నాలుగు స్లాబుల నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సచివాలయ నిర్మాణం పకడ్బందీగా జరుగుతోందని చెప్పారు. 200 ఏళ్ల పాటు నిర్మాణం పటిష్టంగా ఉండేలా, భూకంపాలను సైతం తట్టుకునేలా నాణ్యతతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఐఐటీ నిపుణుల సూచన, స్ట్రక్చర్ ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

మొత్తం వ్యవస్థ ఒకే చోట

దక్షిణ భారతదేశ సంప్రదాయానికి అనుగుణంగా దక్కన్ కాకతీయ నిర్మాణశైలిలో భవనం.. చారిత్రక కట్టడాన్ని తలపించేలా రూపుదిద్దుకోనుంది. 25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన పచ్చికబయలుతో సచివాలయ భవన నిర్మాణం రానుంది. హుస్సేన్​సాగర్‌కు అభిముఖంగా 6 అంతస్తుల్లో... 6 నుంచి 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమీకృత భవనాన్ని నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, పేషీలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, విభాగాలన్నింటినీ అనుసంధానించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఒక శాఖకు చెందిన మొత్తం వ్యవస్థ ఒకే చోట ఉండేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విశాలమైన సమావేశ మందిరాలు, హాళ్లు, వరండాలతో నిర్మించనున్నారు.

పర్యావరణహితం..

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లోపాలు లేకుండా అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మించనున్నారు. సమీకృత భవనాన్ని కేవలం సచివాలయ కార్యాలయాల కోసం మాత్రమే నిర్మితమవుతుంది. పూర్తి పర్యావరణహితంగా, గ్రీన్ బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగా భవన నిర్మాణం జరగనుంది. దారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేపడుతున్నారు. పూర్తి ఆటోమేటిక్ విధానాన్ని, సెన్సార్ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. సౌరవిద్యుత్, వాననీటి సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. విశాలమైన పచ్చికబయళ్లతో అందమైన ఫౌంటెన్లు సహా వాహనాలు నిలిపేందుకు బహుళ అంతస్థుల పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఉద్యోగుల వాహనాలకు, సందర్శకుల వాహనాల కోసం విడిగా పార్కింగ్ వసతి కల్పిస్తారు.

ఇదీ చదవండి:Amit Shah: విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారు: అమిత్​ షా

Last Updated : Sep 17, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details