ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందేలా కృషి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మంత్రి పరిశీలించారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎర్రగడ్డ హాస్పిటల్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా నిర్మించాలని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రధాన వైద్య అధికారుల బృందం ఆధ్వర్యంలో పరిశీలించి స్థల సేకరణ చేసినట్లు ఆయన తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దేశంలో ఏ ప్రభుత్వం చేయని ఘనత తమకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాలు వైద్యసేవలు మెరుగు పరచడంలో విఫమయ్యాయని విమర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో మరో ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
అంతకు ముందు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాష్ట్ర ప్రధాన వైద్య అధికారుల ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణాన్ని మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాక ఎంతో మార్పులు జరిగాయి. ఆస్పత్రుల్లో పెద్దఎత్తున నియామకాలు చేపట్టాం. సూపర్ స్పెషాలిటీ ఏర్పాటైతే విదేశాల్లో చదువుకున్న వైద్యుల సేవలు వినియోగించుకోవాలి. గత ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన వద్ద గాంధీ ఆస్పత్రిలో ఐసీయూలో ఆధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. మూడో వేవ్ వచ్చినా తట్టుకునేలా వైద్య సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆస్పత్రిని నిర్మించబోతున్నాం. - తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి
ఇదీ చూడండి:ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది: మంత్రి తలసాని