ముంపు బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారని అన్నారు. అమీర్‌పేట డివిజన్‌లోని బస్తీనగర్, గంగుబాయి, బౌదనగర్ వరద బాధితులతో మాట్లాడి... ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున సుమారు 100 మందికి చెక్కులు పంపిణీ చేశారు.
ప్రతీ కుటుంబానికి సాయం
ఈ వరదలతో హైదరాబాద్ నగరంలో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి చేయూత అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని తెలిపారు. నలభై ఏళ్ల చరిత్రలో హైదరాబాద్లో బీభత్సమైన వరద వచ్చిందని... ప్రజలు చాలా నష్టపోయారని అన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. నష్టపోయిన కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉండి... ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు.