తెలంగాణ

telangana

ETV Bharat / state

TALASANI: 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేదే సీఎం లక్ష్యం'

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీపై జిల్లా స్థాయి అధికారుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

TALASANI:  'గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేదే సీఎం లక్ష్యం'
TALASANI: 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేదే సీఎం లక్ష్యం'

By

Published : Jul 31, 2021, 4:26 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. హైదరాబాద్​లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో పశుసంవర్థక శాఖ కార్యకలాపాలు, రెండో విడత గొర్రెల పంపిణీపై జిల్లా స్థాయి అధికారుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి, టీఎస్‌ గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్ పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా చేపట్టబోయే వివిధ పథకాల అమలు, ఇటీవల ప్రారంభించిన రెండో విడత గొర్రెల పంపిణీ, త్వరలో చేపట్టబోయే ఉచిత చేప పిల్లల పంపిణీ ఏర్పాట్లు, పశుగ్రాసం విత్తనాల లభ్యతల పెంపు, ఇతర అంశాలపై చర్చించారు.

గొర్రెల పెంపకం, అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ ద్వారా 6500 కోట్ల రూపాయల సంపద సృష్టించబడిందని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఇటీవల 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందన్న మంత్రి... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని.. ఆ దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పెరిగిన ధరలు దృష్టిలో ఉంచుకొని సీఎం... గొర్రెల యూనిట్ ధర 1.25 లక్షల రూపాయల నుంచి 1.75 లక్షల రూపాయలకు పెంచారని తెలిపారు. పశు గ్రాసం కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుండటమే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో గొర్రెల మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.

వారి జీవితాల్లో వెలుగు నింపాలనే..

చరిత్ర తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా పశుసంవర్ధక శాఖపై ఇంత శ్రద్ధ కనబరిచినట్లు దాఖలాలు లేవు. 2014లో కేసీఆర్​ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి.. కుల వృత్తుల మీద ఆధారపడ్డ జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొదటి విడత గొర్రెల పంపిణీ బ్రహ్మాండంగా జరిగింది. కొన్ని పెండింగ్​ డీడీలు ఉంటే అవి కూడా చేస్తున్నాం. రెండో విడతలో పెరిగిన ధరలు దృష్టిలో ఉంచుకొని సీఎం... గొర్రెల యూనిట్ ధర 1.25 లక్షల రూపాయల నుంచి 1.75 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దీనిపై గైడ్​లైన్స్​ కూడా రెండు మూడో రోజుల్లో ఇచ్చేసి రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ చేపడతాం. దేశంలోనే రాష్ట్రంలోని గొల్లకురుమలను ధనవంతులుగా తీర్చదిద్దడానికి... వారి కుటుంబాలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆగస్టు 3,4 తేదీల నుంచి డీ-వార్మింగ్​ కార్యక్రమం చేపట్టనున్నాం. ప్రతి జిల్లాలో షీప్​ మార్కెట్లు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వెటర్నరీ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేయనున్నాం. -తలసాని శ్రీనివాస్‌యాదవ్, పశుసంవర్ధక శాఖ మంత్రి

TALASANI: 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేదే సీఎం లక్ష్యం'

ఇదీ చదవండి: RS PRAVEEN KUMAR: 'లక్షల మంది గుండెల్లో నేనున్నా.. ఏం చేస్తారు?'

ABOUT THE AUTHOR

...view details