Minister Review on Pattana Pragathi: హైదరాబాద్ మహానగరంలో గతంతో పోల్చితే ఈ ఏడాది ముంపు ప్రభావం తగ్గుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే ఏడాది వేసవి నాటికి ముంపు ప్రభావం లేకుండా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగరంలో వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులపై ఎక్కువగా దృష్టిసారించామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద నగరంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 15రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాలా, గార్బేజి, హరితహారం వంటి కార్యక్రమాలు చేపడుతామని తలసాని వివరించారు. పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ వచ్చిన తర్వాత నగరంలో చాలా దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరికిందని మంత్రి తెలిపారు. పట్టణ ప్రగతిలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సహకారం అందించాలన్నారు.