రాష్ట్రంలో ఉత్పత్తవుతున్నచేపల కొనుగోళ్లు, మార్కెటింగ్, ఎగుమతుల ప్రక్రియను.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే విషయం పరిశీలిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ కార్యకలాపాలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా.. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి చెప్పారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో చేపల మార్కెటింగ్, సంపద వంటి అంశాలపై అధికారులతో మంత్రి విస్తృతంగా చర్చించారు.
రవాణాకు క్లస్టర్లు
2016-17లో రాష్ట్రంలో 1.97 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా... 2020-21 నాటికి 3.49 లక్షల టన్నులకు పెరిగిందని తలసాని అన్నారు. ఉత్పత్తి అయిన చేపల్లో 60 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుండగా... 21 శాతం పశ్చిమ బంగ, మిగిలిన 19 శాతం అసోం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయని వివరించారు. మత్స్య ఫెడరేషన్ కొనుగోలు చేసిన చేపలను.. నాణ్యతా ప్రమాణాలతో 'తెలంగాణ చేపలు' బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు మొబైల్ ఫిష్ ఔట్లెట్లు ప్రారంభించామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మత్స్య సొసైటీల నుంచి కొనుగోలు చేసిన చేపలను.. 2 లేదా 3 మండలాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు.