Talasani on Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
భవనం పరిస్థితి ఏంటని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి తలసాని ఆరా తీశారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమై ఉంటుందని తెలుసుకున్నారు. అనంతరం దక్కన్ మాల్ సమీపంలోని నల్లగుట్ట బస్తీలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Minister Talasani on Secunderabad Fire Accident : అగ్ని ప్రమాదంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని బస్తీవాసులు మంత్రితో తమ గోడు వెల్లబోసుకున్నారు. అగ్నిప్రమాదానికి గురైన భవనం ఒక్కసారిగా కూలిపోతే.. తీవ్రంగా నష్టపోతామని వాపోయారు.
అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని భవనం కూల్చివేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్థానికులకు భరోసానిచ్చారు. పొరుగున ఉన్న వాళ్లకు ఇబ్బంది లేకుండా కూల్చివేస్తామని చెప్పారు. భవనం కూల్చివేత సమయంలో ఎవరికైనా నష్టం కలిగితే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి భవనం కూల్చివేస్తామని తెలిపారు.
'ఇప్పటికీ భవనం లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. కనిపించకుండా పోయిన వారి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. నిన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. 2008లో ఆగిపోయిన పథకం గురించి కిషన్‌రెడ్డి మాట్లాడారు. మూడు రోజులుగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. అగ్నిమాపకసిబ్బంది, ఇతర అధికారుల శ్రమను అభినందిస్తున్నా. నిన్న అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బంది ఆరోగ్యం నిలకడగానే ఉంది. భవనాలకు అనుమతులపై పటిష్ఠ చట్టం రూపొందించాం. పేదల విషయంలో సానుకూలంగా ఆలోచించి చర్యలు తీసుకుంటాం.' -తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి
Secunderabad Fire Accident Update : అగ్ని ప్రమాదం జరిగిన సముదాయంలో ఇప్పటికీ కొన్ని అంతస్తుల నుంచి పొగలు వెలువడుతుండడంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. లోపల ఫోమ్ చల్లి పూర్తిగా ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని అధునాతన స్కానర్లతో క్లూస్ టీం పరిశీలిస్తోంది. క్లూస్ టీంకు నేతృత్వం వహిస్తోన్న అధికారి వెంకన్న మాట్లాడారు.
‘‘ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటికీ సముదాయంలో దట్టంగా పొగ వ్యాపించి ఉంది. లోపలికి వెళ్లేందుకు అన్ని మార్గాలను పరిశీలస్తున్నాం. ఒక్కసారి లోపలికి వెళ్లగలిగితే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. సెంట్రల్ జోన్ డీసీపీ, ఇతర అధికారులతో పాటు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని వెంకన్న పేర్కొన్నారు.
ఘటనా స్థలిని పరిశీలించిన నేతలు..సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనా స్థలికి తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ, సీపీఎం నాయకులు పరిశీలించారు. తాజా పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: