Talasani Srinivas Yadav On Governor: గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్నారని... వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందన్నారు. గవర్నర్కు ఒక పరిధి ఉందని.. ఆ పరిధిని భారత రాజ్యాంగం పెట్టిందన్నారు. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యత రాహిత్యం అవుతుందని చెప్పారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదని... గతంలో గవర్నర్లను గౌరవించామని వారిని ఎలా గౌరవించాలో తమకు, ముఖ్యమంత్రికి తెలుసన్నారు.
గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని... ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదని తలసాని సూచించారు. ప్రధాని, హోంమంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవసరం లేదన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడలేనని తమకు పరిధులు ఉంటాయని... హుందాతనంగా వ్యహరించారని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్ను గద్దె దించేందుకు గవర్నర్ను వాడుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్ష పార్టీలకు నోటికి బట్ట లేదని విమర్శించారు. వరి దాన్యం మీద పోరాటం చేస్తున్నామని... రైతులకు అవసరమైన విధంగా మాట్లాడాలని కోరారు.