రాష్ట్రంలో మత్స్యకారులపై దాడులకు పాల్పడినా.. మత్స్య సంపదకు నష్టం కలిగించినా.. అలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంకులోని పశు సంక్షేమ భవన్‌లో మత్స్యకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశయ్యారు. రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు.
మత్స్యకారులపై దాడుల నియంత్రణకు, చేపల చెరువుల లూఠీలు జరగకుండా అరికట్టేందుకు సమగ్ర విధానం తీసుకు రావాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యలను గుర్తించి.. పరిష్కరించేందుకు అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. 10 మంది మత్స్యకార ప్రతినిధులతో ఓ కమిటీ నియమించిందని తెలిపారు. మత్స్యకారులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని.. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందని మంత్రి చెప్పారు.