లాక్డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో పడిన తెలుగు టెలివిజన్, సినీ పరిశ్రమను ఆదుకుని... వెంటనే చిత్రీకరణలకు అనుమతి ఇవ్వాలన్న వినోద పరిశ్రమవర్గాల అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరిశ్రమలోని 24 విభాగాల వారీగా... సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. మాసబ్ ట్యాంక్‌లోని ఆయన కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్, కార్యదర్శి దామోదరప్రసాద్, నిర్మాతలు దిల్ రాజు, అభిషేక్ అగర్వాల్, ఏషియన్ సునీల్, మా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నరేష్, జీవిత రాజశేఖర్‌తో పాటు పలువురు థియేటర్ల యాజమానులు ఈ భేటీకి హాజరయ్యారు.
థియేటర్లు ప్రారంభించాలి..
థియేటర్లను పునఃప్రారంభించాలని మురళీమోహన్ మంత్రిని కోరారు. ప్రభుత్వం రాయితీలు కల్పిస్తేనే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి నెలకొంటుందని విన్నవించారు. అలాగే పార్కింగ్ ఛార్జీలను నిర్ణీత మొత్తంలో తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అటు నిర్మాతలు కూడా సినిమా చిత్రీకరణ అనుమతులపై మరోసారి వివరించారు. ఇండోర్, ఔట్‌డోర్ సెట్లలో తీసుకోబోయే జాగ్రత్త చర్యలను మంత్రికి వివరించారు. నటీనటుల సంఘం నుంచి హాజరైన నరేష్, జీవిత రాజశేఖర్‌లు... సినిమా చిత్రీకరణ అనుమతులిచ్చాక... నటీనటుల ఆరోగ్య భద్రతపై భరోసా కల్పించాలని కోరారు.
''మా వరకు మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. స్టాఫ్‌ను తగ్గించుకుని తగిన చర్యలు తీసుకుంటాం. ఏది ఏమైనా ఇదంతా రిస్క్‌తో కూడినదే. కరోనాతో మనం బ్రతకాలి. ప్రభుత్వం ప్రతి షూటింగ్ స్పాట్ వద్ద క్రిమిసంహారక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరాం. ప్రభుత్వం మాకు ఆ సేఫ్టీని ఇవ్వగలిగినప్పుడు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.''
-నరేష్, నటీనటుల సంఘం అధ్యక్షుడు