Minister Talasani Comments on BJP: తెలంగాణ దయాదాక్షిణ్యాలపైనే కేంద్రం నడుస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. దేశంలో భాజపా గల్లంతయ్యే పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి భయపడే పరిస్థితిలో తెలంగాణ లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. పాకిస్థాన్, మతం పేరుతో రెచ్చగొట్టడమే భాజపాకు తెలుసని విమర్శించారు.
వారి కోసమే పని చేస్తోంది
"రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తెరాస ప్రభుత్వం మేలు చేస్తోంది. కానీ భాజపా మాత్రం పారిశ్రామికవేత్తల కోసం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తోంది. మతం పేరుతో రెచ్చగొట్టడమే భాజపాకు తెలుసు. తెలంగాణ దయాదాక్షిణ్యంపైనే కేంద్రం బతుకుతుందన్న విషయం కేంద్రం మరిచిపోవద్దు. రాహుల్ గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యల పట్ల కేసీఆర్ స్పందిస్తే.. కాంగ్రెస్‌తో తెరాస కలిసిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నా రు." -తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి
స్పందిస్తే కలిసిపోయినట్లా.?
రాజకీయాల కోసం భాజపా.. సర్జికల్ స్ట్రైక్, పుల్వామా, రావత్ వంటి అంశాలను వాడుకోవడం సిగ్గు చేటని మంత్రి తలసాని అన్నారు. ఆర్మీని రాజకీయాల కోసం వాడుకునే ఏకైక పార్టీ భాజపా అని దుయ్యబట్టారు. కేసీఆర్ రఫేల్ ఒప్పందంలో అవినీతిపై మాట్లాడితే... దానికి సైనికులకు సంబంధమేంటని తలసాని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలపై స్పందించి అసోం సీఎంతో రాజీనామా చేయించకుండా.. కాంగ్రెస్‌తో తెరాస మిలాఖత్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. అసోం ముఖ్యమంత్రి సంబోధించిన అంశాలను భాజపాపై ప్రయోగిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇక.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు తలసాని. ఆయన ఇన్‌ఛార్జి అయ్యాక.. కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేదని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి తెలంగాణ గురించి మాట్లాడతారా అని వ్యాఖ్యానించారు.